20 లక్షల సురక్ష స్టోర్లు

శవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో 20 లక్షల ‘సురక్ష’ రిటైల్‌ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. లాక్‌డౌన్‌లో కొనసాగింపు, అనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సరిపడా నిత్యావసర సరుకులను భద్రతాప్రమాణాలతో సరఫరా చేయడం, దుకాణాల్లో పరిశుభ్రతను పాటించడం దీని లక్ష్యం. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కిరాణా దుకాణాలను పరిశుభ్రమైన రిటైల్‌ ఔట్‌లెట్లుగా మారుస్తారు. దీనికోసం అగ్రశ్రేణి సరుకు రవాణా సంస్థలతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒకదఫా చర్చలు జరిపింది. 50కి పైగా సంస్థలను కేంద్రం సంప్రదించినట్టు సమాచారం. ఎంపిక చేసిన సంస్థకు ఒకట్రెండు రాష్ర్టాల బాధ్యతను అప్పగించవచ్చు. రానున్న 45 రోజుల్లో 20 లక్షల రిటైల్‌ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. అగ్రశ్రేణి ఉత్పాదక సంస్థలతో కలిసి ‘సురక్ష సర్కిల్‌' ఏర్పాటు చేయాలని కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఒక సురక్ష సర్కిల్‌ పరిధిలోకి 5000 కుటుంబాలు, 50 వేల ఎస్‌ఎంఈలను తేవాలని భావిస్తున్నది.